హైదరాబాద్:
రాజధాని హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా వినబడిన భారీ శబ్దంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మంగళవారం ఉదయం సరిగ్గా 9.15 గంటల సమయంలో రాజేంద్రనగర్ మరియు దాని పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున శబ్దం వచ్చింది.
పలు ప్రాంతాల్లో ప్రకంపనలు
నగరంలోని ఉప్పర్‌పల్లి, ఎర్రబోడ, లంగర్‌హౌస్, కేశవస్వామినగర్, రాజేంద్రనగర్ తదితర ప్రాంతాల్లో ఈ భారీ శబ్దం వినబడింది. ఈ ధ్వని ప్రభావంతో రాజేంద్రనగర్ పరిసరాల్లో కొన్ని సెకన్ల పాటు ప్రకంపనలు కూడా చోటుచేసుకున్నాయని స్థానికులు తెలిపారు. ఉదయాన్నే వినబడిన శబ్దంతో ఇళ్లలోని ప్రజలు ఏం జరుగుతుందో అర్థం కాక రోడ్లపైకి పరుగులు తీశారు.
Also Read - గోదావరి జలాలపై రాజకీయ రగడ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు
పోలీసులు ఆరా
ఇది ఎక్కడైనా ఉద్దేశపూర్వకంగా చేసిన బ్లాస్టింగ్ శబ్దమా? లేక భూకంపం వల్ల వచ్చిందా? అనే దానిపై స్థానికులు చర్చించుకుంటున్నారు. కాగా, ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. అసలు ఈ భారీ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది, దానికి గల కారణాలు ఏమిటనే విషయాలపై పోలీసులు అన్ని కోణాల్లో ఆరా తీస్తున్నారు.
